Shane Warne : ఆస్ట్రేలియాకు చెందిన లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేర్ వార్న్ (52) కన్నుమూశారు. వార్న్‌కు చెందిన ఓ మేనేజ్‌మెంట్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయన థాయ్ లాండ్‌లోని కో సముయ్‌లో వెకేషన్‌లో ఉన్నట్లు సమాచారం. తన గదిలో ఆయన అచేతనంగా పడి ఉండడాన్ని గమనించిన హోటల్ సిబ్బంది ఆయనను లేపేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనలో ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆయన హార్ట్ ఎటాక్ వల్ల మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.
కాగా 24 గంటల్లోనే ఆస్ట్రేలియాకు చెందిన రెండో క్రికెటర్ కన్నుమూయడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్ రోడ్ మార్ష్ కన్ను మూసిన 24 గంటల్లోనే వార్న్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. రోడ్ మార్ష్ చనిపోయినందుకు బాధగా ఉందని.. ఆయన ఎంతో మంది యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిచారని.. వార్న్ శుక్రవారం ఉదయమే ట్వీట్ చేశారు. కానీ ఆ తరువాత కొన్ని గంటలకే వార్న్ కూడా కన్నుమూశారు.
కాగా షేన్ వార్న్ తన బౌలింగ్ శైలిలో ఎంతో ఆకట్టుకున్నారు. పిచ్‌పై గింగిరాలు తిరిగే లెగ్ స్పిన్ బంతులను వేయడంలో వార్న్ దిట్ట. ఆయనలా బంతులను తిప్పాలని చాలా మంది ఆయనను ప్రేరణగా కూడా తీసుకుంటుంటారు. ఇక 1993లో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన యాషెస్ టెస్టులో వార్న్.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మైక్ గ్యాటింగ్ వికెట్ తీసి చరిత్ర సృష్టించారు. ఆ బాల్ గింగిరాలు తిరుగుతూ వచ్చి వికెట్లను గిరాటేసింది. దీంతో గ్యాటింగ్ ఖంగు తిన్నాడు. ఇక గ్యాటింగ్‌ను ఔట్ చేసేందుకు వార్న్ వేసిన బంతిని.. బాల్ ఆఫ్ ది సెంచరీగా పిలుస్తుంటారు.
షేన్ వార్న్ ఈ శతాబ్దపు 5 మంది ఉత్తమమైన విస్డెన్ క్రికెటర్లలో ఒకరిగా పేరు గాంచారు. ఈయన వన్డేల్లో 293 వికెట్లు, టెస్టుల్లో 708 వికెట్లు తీశారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్‌గా వార్న్ పేరుగాంచారు. 1992లో సిడ్నీలో భారత్ తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా వార్న్ టెస్ట్ క్రికెట్‌కు పరిచయం అయ్యారు. తరువాత 1993లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా వార్న్ వన్డేల్లో అరంగేట్రం చేశారు. 1999లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ను గెలుచుకోవడంలో వార్న్ కీలకపాత్ర పోషించారు. ఆయనకు ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పాకిస్థాన్‌పై వార్న్ 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లను తీసి తమ జట్టుకు విజయాన్ని అందించాడు.
ఇక షేర్ వార్న్‌ను క్రికెట్ ప్లేయర్లు, ప్రేమికులు ముద్దుగా వార్నీ అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం ఆయన ఒక సీజన్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడాడు. ఆ సీజన్ తొలి సీజన్ కాగా.. రాజస్థాన్ ట్రోఫీ సాధించింది. తరువాత రాజస్థాన్ రాయల్స్‌కు మెంటార్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో వార్న్ పలు మ్యాచ్‌లకు కామెంట్రీ కూడా చెప్పి అలరించారు. ఆయన మరణంతో తోటి మాజీ ప్లేయర్లు, క్రికెట్ ప్లేయర్లు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.