భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ధోనీ పేరు వినగానే మనకు అతని కూల్ యాటిట్యూడ్, మైదానంలో అతని ప్రవర్తన, జట్టు ఆటగాళ్లకు ఉత్సాహాన్ని అందించే మాటలు, తనదైన శైలిలో విరుచుకు పడే హెలికాప్టర్ షాట్లు మనకు గుర్తుకు వస్తాయి. భారత జట్టుకు రెండు వరల్డ్ కప్ లను అందించడమే గాక టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. అనేక ఉత్కంఠ మ్యాచుల్లో జట్టును ఒంటి చేత్తో నడిపించి విజయ తీరాలకు చేర్చిన క్షణాలు మనకు కళ్ల ముందు మెదులుతాయి. అయితే ధోనీకి, భారత జట్టులో మిగతా ఆటగాళ్లకు ఓ తేడా కనిపిస్తుంది. దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఆ తేడా ఏంటో గమనించారా ?
మాజీ ఆటగాడు సచిన్ టెండుల్కర్ తన హెల్మెట్ మీద జాతీయ జెండాను పెట్టుకునే వాడు గుర్తుంది కదా. అప్పట్లో దీన్ని చాలా మంది విమర్శించారు కూడా. తరువాత ఇదే సాంప్రదాయాన్ని అనేక మంది ఆటగాళ్లు పాటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు టీమిండిలో విరాట్ కోహ్లి తదితర ఇతర ప్లేయర్స్ కూడా తమ తమ హెల్మెట్స్‌పై జాతీయ జెండాను పెట్టుకుంటున్నారు. కానీ ఒక్క మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం తన హెల్మెట్‌పై జాతీయ జెండాను పెట్టుకోలేదు. అవును, గమనించారు కదా. పైన మేం చెప్పిన తేడా అదే.
అయితే అసలు ధోనీ తన హెల్మెట్‌పై జెండాను ఎందుకు పెట్టుకోలేదో తెలుసా..? అందుకు కారణం ఉంది. అదేమింటే… ధోనీ బ్యాటింగ్ చేసేటప్పుడు ఓకే. కానీ భారత జట్టు బౌలింగ్ చేసే సమయాల్లో మాత్రం ధోనీ వికెట్ల వెనుక కీపింగ్ చేస్తుంటాడు కదా. ఆ సమయంలో ఒక్కోసారి తన సౌకర్యానికి అనుగుణంగా హెల్మెట్‌ను తీసి కింద పెడుతుంటాడు. తన వెనుక ఆ హెల్మెట్‌ను కింద గ్రౌండ్‌పై పెడతాడు. మరలా పెట్టినప్పుడు ఆ హెల్మెట్‌పై జెండా ఉంటే దాన్ని అగౌరవ పరిచినట్టే అవుతుంది కదా. అందుకనే ధోనీ తన హెల్మెట్‌పై జెండాను పెట్టుకోలేదు. ఇదీ దాని వెనుక ఉన్న అసలు కారణం. అంతే కానీ ధోనీకి జెండాపై గౌరవం లేదనడం సరికాదు. నిజానికి మీకు తెలుసా..? ధోనీ ఓ సారి ఇంటర్వ్యూలో చెప్పాడు, తాను క్రికెటర్ కాకుండా ఉంటే మిలటరీలో చేరేవాన్నని అన్నాడు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది, అతనికి ఎంత దేశ భక్తి ఉందో. ఇక హెల్మెట్ పై జెండా విషయంలోనూ ధోనీ చేసింది కరెక్టే కదా..!