అగ్ని పర్వతాలు, వాటిలో విస్ఫోటనం చెందే లావా గురించి తెలుసుగా! దాదాపుగా ఎలాంటి పదార్థన్నయినా కరిగించి బూడిద చేసే అత్యంత అధిక ఉష్ణోగ్రత ఆ లావాలో ఉంటుంది. ఈ క్రమంలో దానికి ఎదురు వెళ్తే ఇక అంతే సంగతులు. మృత్యువును కోరి కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. సృష్టిలోని దాదాపు ఏ పదార్థమూ ఆ లావాను ఆపలేదు. కానీ దాన్ని ఆపే శక్తి ఒక్క పదార్థానికి ఉంది. అదే కొబ్బరి. అవునా, అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే.
కొబ్బిరికాయలు, వాటిలో ఉండే నీరు మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను కలిగిస్తాయని మనకు తెలుసు. అయితే కేవలం అవే కాదు. కొబ్బరికాయలతో మరో ఆశ్చర్యకరమైన ఉపయోగం కూడా ఉంది. అదేమిటంటే ఆ కాయలు ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉన్న లావానైనా తట్టుకుని ఇట్టే నిలబడగలవు. ఆశ్చర్యపోయినా మీరు ఇది నమ్మక తప్పదు. ఓ యూట్యూబ్ ప్రియుడు చేసిన ప్రయోగమే ఇందుకు ఉదాహరణ.
Tito4re పేరిట యూట్యూబ్‌లో ఓ చానల్‌ను నడుపుతున్న ఔత్సాహికుడు కొబ్బరికాయ, మండుతున్న లావాపై వినూత్న ప్రయోగం చేశాడు. కాగా అతను ముందుగా ఓ కొబ్బరికాయను తీసుకున్నాడు. దానికి డ్రిల్ మిషన్ సహాయంతో డబ్బా మూత లాంటి చిన్న రంధ్రం చేశాడు. అందులోంచి కొబ్బరికాయలో ఉన్న నీటినంతా తీశాడు. అనంతరం ఓ చిన్న ఫర్నేస్‌లో కొద్దిగా రాగిని లావా రూపంలోకి కరిగించి దాన్ని ఆ కొబ్బరికాయలో మెల్లిగా పోశాడు. అలా పోసే క్రమంలో ఆ కొబ్బరికాయ నుంచి మంటలు రావడం ప్రారంభించాయి. అయినా తాను కరిగించిన రాగి మొత్తాన్ని అందులో పోసేశాడు.
అప్పుడు దాని నుంచి మంటలు ఇంకా ఎక్కువయ్యాయి. అయినప్పటికీ కాయలోపల పోసిన లావా ఏ మాత్రం బయటికి రాలేదు సరికదా కాయ చుట్టూ మందంగా ఉన్న టెంక కూడా ఏమాత్రం పగలలేదు. అనంతరం అతను ఆ కాయలో నీటిని పోసి ఆ లావాను (కరిగిన రాగిని) చల్లార్చాడు. దీంతో ఆ రాగి గట్టిపడింది. అప్పుడు ఆ రాగిని బయటకు తీసి తూకం వేయగా దాని బరువు 3 పౌండ్ల 14 ఔన్సులు (1.757 కిలోలు) వచ్చింది. అంటే ఒక కొబ్బరికాయ దాదాపు 1.75 కిలోల లావాను ఆపగలదన్నమాట. చూశారా! ఆ వ్యక్తి ప్రయోగం వల్ల ఎంత విలువైన విషయం తెలిసిందో. మీకు ఈ విషయంపై ఇంకా నమ్మకం లేకపోతే ఆ వ్యక్తి చేసిన ప్రయోగాన్ని కింద ఇచ్చిన యూట్యూబ్ వీడియోలో వీక్షించవచ్చు.