Gas Trouble : ప్రస్తుత తరుణంలో గ్యాస్ సమస్య అనేది చాలా మందికి వస్తోంది. సమయానికి భోజనం చేయకపోవడం, అధిక ఒత్తిడి, ఆందోళన, తగినంత నీటిని తాగకపోవడం, రాత్రి ఆలస్యంగా నిద్రించడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గ్యాస్ సమస్య వస్తోంది. అయితే కింద తెలిపిన 3 ఆసనాలను రోజుకు 5 నిమిషాల పాటు వేయండి. దీంతో గ్యాస్ సమస్య ఇట్టే తగ్గిపోతుంది. మరి ఆ ఆసనాలు ఏమిటంటే..
1. పవనముక్తాసనం
నేలపై వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లను దగ్గరగా తేవాలి. వాటిని మడతబెట్టి ఛాతి మీదకు తేవాలి. తరువాత తలను కొద్దిగా పైకి లేపి ముందుకు వంచాలి. తలను మోకాళ్లను తగిలించాలి. ఇలా వీలైనంత సేపు ఈ భంగిమలో ఉండాలి. రోజు కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయాలి. తరువాత సమయాన్ని 5 నిమిషాలకు పెంచాలి. ఈ ఆసనం వేయడం వల్ల అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
2. త్రికోణాసనం
నేలపై నిలబడి కాళ్లను దూరంగా చాపాలి. ఎడమవైపుకు వంగి ఎడమ చేతిని నేలపై ఉంచాలి. చేతిని ఎడమ కాలు దగ్గరగా ఉంచాలి. కుడి చేతిని అలాగే పైకి చాపాలి. ముఖాన్ని పైకి తిప్పి కుడి చేతిని చూడాలి. ఇలా రెండో వైపుకు కూడా చేయాలి. ఈ ఆసనాన్ని 5 నిమిషాల పాటు రోజూ చేస్తే గ్యాస్ సమస్య ఉండదు.
3. వజ్రాసనం
నేలపై పద్మాసనంలో కూర్చోవాలి. తరువాత కాళ్లను మడిచి వెనుకవైపుకు పెట్టాలి. పాదాలను పిరుదుల కింద ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండు చేతులను రెండు కాళ్లపై పెట్టాలి. ఈ భంగిమలో 5 నిమిషాల పాటు ఉండాలి. దీన్ని భోజనం చేశాక కూడా వేయవచ్చు. ఈ ఆసనాన్ని కూడా రోజూ వేయడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్ సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.