Grapes Lassi : ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ద్రాక్ష పండ్లను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. అయితే ద్రాక్ష పండ్లతో లస్సీని కూడా తయారు చేసుకుని తాగవచ్చు. ఎండకాలంలో ఇలా లస్సీ తాగడం మనకు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. అలాగే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. ఇక ద్రాక్ష పండ్లతో లస్సీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రాక్ష పండ్ల లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – అర లీటర్, ద్రాక్ష పండ్లు (విత్తనాలు లేనివి) – పావు కిలో, చక్కెర లేదా తేనె – పావు కప్పు, ఉప్పు – చిటికెడు.
ద్రాక్ష పండ్ల లస్సీని తయారు చేసే విధానం..
పెరుగులో కావల్సినన్ని నీళ్లు పోసి పలుచగా చేసుకోవాలి. లస్సీ మరీ పలుచగా కావాలంటే ఎక్కువ నీళ్లను పోయాలి. లేదా తక్కువ నీళ్లను పోయాలి. ఇలా చిలికిన పెరుగులో విత్తనాలు తీసిన ద్రాక్ష పండ్లు, చక్కెర లేదా తేనె, ఉప్పు అన్నింటినీ వేసి కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి లస్సీలా పట్టుకోవాలి. మరీ చిక్కగా ఉందనుకుంటే కాస్త నీళ్లను కలపవచ్చు. నీళ్లను కలిపితే అందుకు తగిన విధంగా చక్కెర లేదా తేనె కలపాలి. దీంతో లస్సీ తయారవుతుంది. అయితే దీన్ని చల్లగా కావాలనుకుంటే 2 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. ఆ తరువాత తాగాలి. లేదా చల్లని పెరుగు, నీళ్లతో అప్పటికప్పుడు లస్సీని తయారు చేసుకుని కూడా తాగవచ్చు. ఇలా ద్రాక్ష పండ్లతో లస్సీని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలోని వేడి మొత్తం పోతుంది. దీంతోపాటు ద్రాక్ష పండ్లలో ఉండే పోషకాలు అన్నీ లభిస్తాయి. వీటి వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.