Tomato Aloe Vera Face Pack : ప్రస్తుత కాలంలో చర్మ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. మొటిమలు, మచ్చలు, కురుపులు, బ్లాక్ హెడ్స్, ముఖం తరచూ జిడ్డుగా మారడం వంటి అనేక రకాల సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. ఈ సమస్యల బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం, మానసిక ఒత్తిడి వంటి వాటిని ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీటి నుండి బయట పడడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల సబ్బులు, క్రీమ్స్, ఫేస్ ప్యాక్ లను వాడుతూనే ఉంటారు. వీటిని వాడడం వల్ల ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.
బయట దొరికే ప్రొడక్ట్స్ లో రసాయనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు వీటిని వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి రసాయనాలను వాడకుండా కేవలం ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్యలన్నింటి నుండి బయట పడవచ్చు. దీని కోసం మనం కలబంద, టమాట, గంధం పొడి, శనగ పిండిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడాల్సి ఉంటుంది. వీటితో ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. ఎంత పరిమాణంలో వీటిని తీసుకోవాలి.. ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మధ్యస్థంగా ఉండే టమాటాను తీసుకుని ముక్కలుగా చేసి ఒక జార్ లో వేసుకోవాలి. తరువాత రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును తీసుకుని అదే జార్ లో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక టీ స్పూన్ గంధం పొడిని, ఒక టీ స్పూన్ శనగపిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. చర్మానికి ఎటువంటి హాని కలగదు. అంతే కాకుండా చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది.