Sun Flower Seeds : మనకు అందుబాటులో ఉన్న అనేక విత్తనాల్లో పొద్దు తిరుగుడు విత్తనాలు ఒకటి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, హై క్వాలిటీ ప్రోటీన్లు, విటమిన్ ఇ, బి1, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నిషియం, జింక్, ఇతర మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో కొలెస్ట్రాల్ ఉండదు. 50 శాతం ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కనుక వీటిని నిర్భయంగా తినవచ్చు. పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, షుగర్, బీపీ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఈ విత్తనాల ద్వారా మనకు అత్యుత్తమ క్వాలిటీ కలిగిన ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాలకు శక్తిని అందిస్తాయి.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇతర ఏ ఆహారాల్లోనూ లభించని రీతిలో మనకు విటమిన్ ఇ పొద్దు తిరుగుడు విత్తనాల ద్వారా లభిస్తుంది. 100 గ్రాముల పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే సుమారుగా 38 మిల్లీగ్రాముల విటమిన్ ఇ లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాక.. పురుషుల్లో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు, చర్మం, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
విటమిన్ ఇ మన శరీరంలో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లా కూడా పనిచేస్తుంది. ఇది హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తుంది. కణాలను రక్షిస్తుంది. దీని వల్ల క్యాన్సర్ కణాలు పెరగవు. అలాగే గుండె జబ్బులు, షుగర్ రావు. ఇక పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల మనకు అధిక మొత్తంలో క్యాలరీలు లభిస్తాయి. 100 గ్రాముల విత్తనాలను తింటేనే 600 క్యాలరీల శక్తి లభిస్తుంది. కనుక బరువు తగ్గాలనుకునేవారు వీటిని రోజుకు గుప్పెడు మోతాదులోనే తినాలి. ఇక మిగిలిన వారు కూడా గుప్పెడు మోతాదులో తింటే చాలు. ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక అధిక మొత్తంలో తింటే జీర్ణం కాక గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక పొద్దు తిరుగుడు విత్తనాలను తినేవారు ఈ జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి.