Ragi Soup : ప్రస్తుత కాలంలో చిరు ధాన్యాల వాడకం రోజురోజుకీ పెరుగుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో, భవిష్యత్తులో వాటి బారిన పడకుండా చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు విరివిరిగా లభించే చిరు ధాన్యాలలో రాగులు కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలిసినవే. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు.
రాగులను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్త హీనత సమస్య తగ్గుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. రాగి పిండితో మనం రొట్టెలను, దోశలను, ఉప్మాను తయారు చేస్తూ ఉంటాం. రాగి పిండితో ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిని మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. రాగి సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు- తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యారెట్ – పావు కప్పు, చిన్నగా తరిగిన క్యాబేజి – పావు కప్పు, పచ్చి బఠాణీ – పావు కప్పు, చిన్నగా తరిగిన బీన్స్ – పావు కప్పు, చిన్నగా తరిగిన క్యాప్సికం – పావు కప్పు, తరిగిన కాలీప్లవర్ – పావు కప్పు, నీళ్లు – 4 కప్పులు, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రాగి సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని తగినన్ని నీళ్లను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నెయ్యిని వేసి వేడయ్యాక జీలకర్ర, ఎండు మిర్చిని వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత తరిగిన క్యారెట్, క్యాబేజీ, పచ్చి బఠాణీ, బీన్స్, క్యాప్సికం, కాలీప్లవర్ లని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత 3 కప్పుల నీళ్లను, మిరియాల పొడిని, తగినంత ఉప్పును వేసి కలిపి మూత పెట్టి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత ముందుగా ఉండలు లేకుండా కలుపుకున్న రాగి పిండిని వేసి కలపాలి. ఇప్పుడు మరో కప్పు నీళ్లను పోసి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే రాగి సూప్ తయారవుతుంది. దీనిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా అయినా తీసుకోవచ్చు.
రాగి పిండితో తరచూ చేసే జావకు బదులుగా ఇలా సూప్ ను చేసుకుని కూడా తాగవచ్చు. రాగి పిండితో సూప్ ను చేసుకుని తాగడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. ఉదయం పూట ఈ సూప్ ను తాగడం వల్ల ఈ సూప్ జీర్ణం అవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఆకలి త్వరగా వేయదు. తద్వారా బరువు తగ్గడంలోనూ ఈ సూప్ ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఈ సూప్ ఎంతగానో మేలును కలిగిస్తుంది. తరచూ రాగి సూప్ ను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.