Pesara Pappu Pakodi : పెసల్ని తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఇవి శరీరానికి ఎంతో చలువ చేస్తాయి. బరువు తగ్గించడంలో సహాయ పడతాయి. వీటిని తింటే శరీరానికి ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. కనుక శక్తి అందుతుంది. అందువల్ల పెసలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే నేరుగా పెసలను ఉడకబెట్టి లేదా మొలకెత్తించి తినడం కష్టం అవుతుంది అనుకుంటే వీటితో పకోడీలను వేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇక పెసర పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసలు – ఒకటిన్నర కప్పు, ఎండు మిర్చి – 5, అల్లం, పచ్చిమిర్చి పేస్టు – 4 టీస్పూన్లు, కరివేపాకు – 2 రెబ్బలు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా, చాట్ మసాలా – ఒక టీస్పూన్.
పెసర పకోడీలను తయారు చేసే విధానం..
పెలసను ఐదారు గంటల ముందు నానబెట్టుకుని మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా రుబ్బుకోవాలి. అందులో ఉప్పి కలిపి పెట్టుకోవాలి. కరివేపాకు, ఎండు మిర్చిని కూడా మెత్తగా చేసుకుని ఈ పిండిలో వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా పిండిలో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడి చేసి ఈ పిండిని పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేగాక తీసేయాలి. వీటిపై చాట్ మసాలా చల్లి వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. పెసల్ని మొలకలు వచ్చాక పకోడీల్లా వేసుకుంటే ఇంకా మరీ మంచిది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు లభిస్తాయి.