Dosakaya Pappu : మనం ఆహారంగా అనేక రకాల కూరగాయలను తింటూ ఉంటాం. వీటిలో దోసకాయ కూడా ఒకటి. దోసకాయలు కూడా మన శరీరానికి కావల్సిన విటమిన్స్ ను, మినరల్స్ ను అందిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వేసవి కాలంలో డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో దోసకాయ ఎంతో ఉపయోగపడుతుంది. దోసకాయను ఉపయోగించి వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అందులో దోసకాయ పప్పు కూడా ఒకటి. దోసకాయతో చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. దోసకాయతో పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన దోసకాయ – 1, కందిపప్పు – ఒక కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 6, ఉప్పు – తగినంత, చింతపండు – కొద్దిగా, పసుపు – అర టీ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండు మిర్చి – 2, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1.
దోసకాయ పప్పు తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో తరిగిన దోసకాయ ముక్కలను, పచ్చి మిర్చిని, పసుపును వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత మూత తీసి గరిటెతో లేదా పప్పు గుత్తితో పప్పును మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పును, చింతపండును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న పప్పును వేసి కలిపి 5 నుండి 10 నిమిషాల వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా దోసకాయతో పప్పును చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.
దోసకాయను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ కె రక్తాన్ని పలుచగా చేయడంలో ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ దోసకాయ సహాయపడుతుంది.