Broccoli Fry : మన శరీరానికి మేలు చేసే కూరగాయలలో బ్రొకలీ కూడా ఒకటి. ఇది ఆకుపచ్చ రంగులో చూడడానికి కాలీఫ్లవర్ లా ఉంటుంది. ఈ బ్రొకలీని చాలా తక్కువగా తింటూ ఉంటారు. ఇది మనకు మార్కెట్ చాలా తక్కువగా కనబడుతుంది. ఇతర కూరగాయల తాగా దీనిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. బ్రొకలీని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుడుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా దీనిని తరచూ తింటూ ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎముకలను ఆరోగ్యంగా దృఢంగా ఉంచడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బ్రొకలీని ఎక్కువగా సలాడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. సలాడ్ రూపంలోనే కాకుండా దీనిని ఫ్రై గా చేసుకుని కూడా తినవచ్చు. బ్రొకలీ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రొకలీ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్దగా తరిగిన బ్రొకొలీ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వేయించిన ధనియాలు – ఒక టీ స్పూన్, పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండు కొబ్బరి – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బ్రొకలీ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో వేయించిన ధనియాలను, అర టీ స్పూన్ జీలకర్రను, పుట్నాల పప్పును, వెల్లుల్లి రెబ్బలను, ఎండు కొబ్బరిని, పసుసుపు, కొద్దిగా ఉప్పును, కారాన్ని వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత జీలకర్రను వేసి వేయించుకోవాలి. తరువాత బ్రొకలీ ముక్కలను వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటపై మధ్య మధ్యలో కలుపుతూ బ్రొకలీ మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రొకలీ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.