Bitter Gourd Pickle : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలలో కాకరకాయలు కూడా ఒకటి. ఇవి చేదుగా ఉంటాయి అన్న కారణంగా వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ కాకరకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కాకరకాయలతో మనం ఎక్కువగా కూరను, వేపుడును, కారాన్ని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కాకరకాయతో ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. దీనిని ఏవిధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా ఉన్న కాకరకాయలు – పావు కిలో, నూనె – 5 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిక్కటి చింతపండు గుజ్జు – 50 గ్రా., ఆవాల పొడి – ఒక టీ స్పూన్, మెంతుల పొడి – అర టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్ లేదా తగినంత, ఉప్పు – తగినంత.
కాకరకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి తొడిమెలను, పైన ఉండే పొట్టును కొద్దిగా తీసేసి గుండ్రని ముక్కలుగా తరిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి రంగు మారే వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారే వరకు ఉంచాలి. అదే కళాయిలో ఆవాలు, జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఎండు మిర్చిని, వెల్లుల్లి రెబ్బలను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత చింతపండు గుజ్జును వేసి కలిపి రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలలో ఆవాల పొడిని, మెంతుల పొడిని, కారాన్ని, ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయపచ్చడి తయారవుతుంది. దీనిని తడి లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల 4 నుండి 6 నెలల పాటు తాజాగా ఉంటుంది. అన్నంతో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.