మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కచ్చితంగా తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. నిద్ర సరిగ్గా పోకపోవడం లేదా నిద్రలేమి సమస్య వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మూడ్ మారుతుంది. మెదుడు పనితీరు మందగిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సన్నగిల్లుతుంది. కనుక నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది.
కరోనా వల్ల ప్రపంచంలో అధిక శాతం మంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ నిద్ర సరిగ్గా పోవడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలో 63 దేశాల్లో 2,555 మంది ప్రజలకు సర్వే చేయగా వారిలో 47 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే ఈ సమస్య నుంచి బయట పడాలని నిపుణులు సూచిస్తున్నారు.
గడ్డి చామంతి పూల (కమోమిల్) టీ
గడ్డి చామంతి పూలలో అపిజెనిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది మెదడు కణాలను ప్రశాంత పరుస్తుంది. దీంతో నిద్ర బాగా వస్తుంది. ఈ పూల టీని తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చని, నిద్ర బాగా పడుతుందని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. దీన్ని రాత్రి పూట నిద్రకు ఉపక్రమించేందుకు గంట ముందుగా తాగితే ఫలితం ఉంటుందని నిపుణులు తెలిపారు.
పాలు
నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగితే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు తెలిపారు. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనబడే అమైనో యాసిడ్ మన శరీరంలో సెరొటోనిన్, మెలటోనిన్ అనబడే సమ్మేళనాలను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. వీటి వల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్ర లేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
కొకోవా
కొకోవాను పాలలో కలిపి తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరం రిలాక్స్ అవుతంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. కొకోవాలో ఉండే ఫ్లేవనాయిడ్స్ నిద్రలేమి సమస్యకు పరిష్కారం చూపుతాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతోపాటు హైబీపీ కూడా తగ్గుతుందని తేల్చారు.