Andhra Special Chicken Curry : చికెన్‌తో మనం అనేక రకాల వెరైటీలను తయారు చేసుకుని తినవచ్చు. దీంతో చాలా మంది కూర, ఫ్రై, బిర్యానీ వంటి వంటకాలను తయారు చేస్తుంటారు. అయితే సంప్రదాయ పద్ధతిలో చేసే కోడికూర ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆంధ్రా స్టైల్‌లో స్పెషల్ కోడికూరను కూడా చేయవచ్చు. సరిగ్గా చేయాలే కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఆంధ్రా స్పెషల్ కోడికూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రా స్పెషల్ కోడికూర తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 5 టీస్పూన్ల, కారం – 5 టీస్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – 4 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు – 2 కప్పులు, టమాటా గుజ్జు – ఒక కప్పు, పచ్చి మిర్చి – 4, కరివేపాకు – 2 రెబ్బలు, ధనియాల పొడి – 2 టీస్పూన్లు, మిరియాల పొడి – అర టీస్పూన్, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, మసాలా కోసం – జీలకర్ర – ఒక టీస్పూన్, సోంపు గింజలు – అర టీస్పూన్, లవంగాలు – 4, యాలకులు – రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్.
ఆంధ్రా స్పెషల్ కోడికూర తయారు చేసే విధానం..
చికెన్ ముక్కల్ని బాగా కడిగి 4 టీస్పూన్ల కారం, 4 టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు పట్టించి అర గంట పాటు పక్కన పెట్టాలి. పచ్చి మిర్చిని సన్నగా తరగాలి. పాత్రలో మసాలా కోసం తీసుకున్నవన్నీ వేయించి చల్లారాక పొడి చేయాలి. బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు, మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత చికెన్ ముక్కలు, గరం మసాలా, మిగిలిన కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. నాలుగైదు నిమిషాలు ఉడికిన తరువాత టమాటా గుజ్జు వేసి నూనె తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక కప్పు నీళ్లను పోసి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి మరికాసేపు ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత కొత్తిమీర తురుము చల్లి దించేయాలి. దీంతో ఘుమ ఘుమలాడే ఆంధ్రా స్పెషల్ కోడికూర తయారవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.