Kobbari Karam Podi : మనం అనేక రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. మనం తయారు చేసే కూరలు చిక్కగా, రుచిగా ఉండడానికి వాటిల్లో మనం ఎండు కొబ్బరిని కూడా వేస్తూ ఉంటాం. ఎండు కొబ్బరిని వేయడం వల్ల కూరలు చిక్కగా వస్తాయి. అంతేకాకుండా ఎండు కొబ్బరిని తినడం వల్ల మన శరీరానికి కూడా మేలు కలుగుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో, మెదడు పని తీరును మెరుగుపరచడంలో, రక్త హీనతను తగ్గించడంలో, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో ఈ ఎండు కొబ్బరి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఎండు కొబ్బరితో మనం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. వంట చేయడం రాని వారు కూడా ఈ కారం పొడిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోగలిగే ఈ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ముక్కలుగా చేసిన ఎండు కొబ్బరి – 100 గ్రాములు, నూనె – అర టేబుల్ స్పూన్, ఎండు మిర్చి – 10 లేదా 12, కరివేపాకు – గుప్పెడు, వెల్లుల్లి రెబ్బలు – 5 , ఉప్పు – తగినంత.
కొబ్బరి కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఎండు మిరపకాయలను, కరివేపాకును వేసి కరకరలాడే వరకు వేయించి చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలను, ఉప్పును, వెల్లుల్లి రెబ్బలను వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే , చాలా సులువుగా ఎంతో రుచిగా ఉండే కొబ్బని కారం పొడి తయారవుతుంది. దీనిని మూత ఉండే సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజు వరకు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి కారం పొడిలో నెయ్యి వేసి అన్నంతో పాటు తినవచ్చు. లేదా ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, ఊతప్పం వంటి వాటితో కూడా తినవచ్చు. అంతేకాకుండా ఈ కారం పొడిని వేపుడు కూరలల్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.