Sanagala Guggillu : మనం ఆహారంగా భాగంగా అప్పుడప్పుడూ శనగలను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. శనగలను తినడం వల్ల దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. శనగల్లో శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఉంటాయి. శనగలను వివిధ రూపాలలో మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనలో చాలా మంది వీటిని గుగ్గిళ్లుగా చేసుకుని తింటారు. శనగ గుగ్గిళ్లు ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. ఎంతో రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఈ శనగ గుగ్గిళ్లను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగ గుగ్గిళ్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగలు – 100 గ్రాములు, ఉప్పు – తగినంత, నూనె – అర టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒకటీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండుమిర్చి- 2, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – చిటికెడు.
శనగ గుగ్గిళ్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగలను తీసుకుని నీళ్లతో శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన శనగలను ఒక కుక్కర్ లో వేసి అవి మునిగే వరకు నీటిని పోసి, తగినంత ఉప్పును వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత మూత తీసి వాటిల్లో ఎక్కువగా నీరు అంతా పోయేలా వాటిని ఒక జల్లి గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత వెల్లుల్లి రెబ్బలను, శనగ పప్పును, మినప పప్పును, ఆవాలను, జీలకర్రను, ఎండు మిరపకాయలను వేసి వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న తరువాత ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉడికించి పెట్టుకున్న శనగలను వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఇంగువ వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగ గుగ్గిళ్లు తయారవుతాయి. సాయంత్రం సమయాలలో స్పాక్స్ గా ఈ విధంగా శనగ గుగ్గిళ్లను తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.