Onion Pakoda : మనం సాయంత్రం సమయాల్లో రకరకాల చిరు తిళ్లను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో పకోడీలు కూడా ఒకటి. పకోడీలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. బయట కూడా మనకు పకోడీలు దొరుకుతూ ఉంటాయి. బయట దొరికే విధంగా పకోడీలను రుచిగా కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 3 కప్పులు, శనగపిండి – అర కప్పు, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – అర టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, తరిగిన కరివేపాకు – రెండు రెబ్బలు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
ఉల్లిపాయ పకోడీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను తీసుకుని వాటిలో ఉండే నీరు బయటకు వచ్చేలా చేత్తో బాగా నలపాలి. తరువాత శనగపిండి, బియ్యం పిండి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత బియ్యం పిండి, శనగపిండి వేసి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి బాగా కలపాలి. అన్నీ వేసి కలిపిన తరువాత ఒక టీ స్పూన్ నూనె కూడా వేసి కలపాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత ఉల్లిపాయ మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్నగా చిన్నగా పకోడీల్లా వేసుకోవాలి. ఈ పకోడీలను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే పకోడీలు తయారవుతాయి. ఈ విధంగా పకోడీలను చేసుకుని వర్షం పడేటప్పుడు తింటూ ఉంటే ఎంతో చక్కని రుచిని ఆస్వాదించవచ్చు. ఇలా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.