Kidney Stones : ప్రస్తుత తరుణంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో కిడ్నీ స్టోన్స్ సమస్య కూడా ఒకటి. దీని వల్ల చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు కేవలం పెద్ద వయస్సులో ఉన్నవారికి మాత్రమే ఈ స్టోన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారికి కూడా కిడ్నీ స్టోన్స్ సమస్య వస్తోంది. దీంతో కడుపు నొప్పి, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, వికారం, వాంతులు కావడం, బలహీనంగా ఉండడం, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా వస్తే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని భావించాలి.
అయితే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు నీళ్లను బాగా తాగడంతోపాటు డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో చిన్న సైజులో ఉండే స్టోన్లు అవే కరిగిపోతాయి. ఇక కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు పలు ఆహార పదార్థాలను తినకూడదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ స్టోన్లు ఉన్నవారు జంక్ ఫుడ్‌ను మానేయాలి. ముఖ్యంగా చైనీస్, మెక్సికన్ ఫుడ్స్ ను తినకూడదు. ఎందుకంటే వీటిల్లో ఉప్పును అధికంగా వాడుతారు. ఇది కిడ్నీలకు కీడు చేస్తుంది. కనుక ఈ ఫుడ్స్‌ను తినకూడదు. అలాగే మాంసాహారాన్ని కూడా తగ్గించాలి. మాంసాహారంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శరీరంలో ప్రోటీన్లు అధికంగా చేరితే అవి కిడ్నీలపై ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. అలాగే పప్పు దినుసుల్లోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కనుక.. వీటిని కూడా తక్కువ మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కిడ్నీ స్టోన్స్ సమస్య మరింత ఎక్కువవుతుంది.
ఇక కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు చాకొలెట్లను కూడా తక్కువగా తినాలి. ఎందుకంటే వీటిల్లో ఉండే ఆగ్జలేట్స్ కిడ్నీ స్టోన్స్‌ను ఏర్పాటు చేస్తాయి. కాబట్టి చాకెట్లను తినరాదు. అలాగే పాలకూర, తృణ ధాన్యాలు, టమాటాల్లోనూ ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా తినరాదు. ఇలా ఆహారం విషయంలో జాగ్రత్తలను పాటించడం వల్ల కిడ్నీ స్టోన్స్‌ను తొలగించుకోవచ్చు. దీంతో మళ్లీ రాకుండా ఉంటాయి.