Guthi Vankaya Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మనకు వివిధ రకాల వంకాయలు లభిస్తాయి. వాటిల్లో గుత్తి వంకాయలు కూడా ఒకటి. గుత్తి వంకాయలు అనగానే చాలా మందికి వాటితో చేసే మసాలా కూర గుర్తుకు వస్తుంది. కానీ ఈ గుత్తి వంకాయలతో ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా చేసుకోవచ్చు. గుత్తి వంకాయలతో వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
గుత్తి వంకాయలు – అర కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – 2 టీ స్పూన్స్, మినప పప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు – 6 లేదా తగినన్ని, చిన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – 5 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గుత్తి వంకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా వంకాయల తొడిమ తీయకుండా వాటిని నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా తరిగిన వంకాయలను ఉప్పు వేసిన నీటిలో 15 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యాక పల్లీలను, శనగ పప్పును, మినప పప్పును వేసి దోరగా వేయించాలి. తరువాత జీలకర్రను, ధనియాలను కూడా వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండు మిరపకాయలను వేసి చిన్న మంటపై వేయించాలి. తరువాత కొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ దినుసులన్నీ చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పసుపును, వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును, చింతపండును కూడా వేసి కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత వంకాయలను వేసి మూత పెట్టి వంకాయలను పూర్తిగా ఉడికించాలి. ఈ వంకాయలు మాడిపోకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. వంకాయలు పూర్తిగా ఉడికిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి మసాలా మిశ్రమమంతా వంకాయల లోపలికి వెళ్లేలా బాగా కలుపుకోవాలి.
ఇలా కలిపిన తరువాత ఈ వంకాయలను మరో 5 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడు తయారవుతుంది. ఈ వేపుడును అన్నం, సాంబార్, రసం, పెరుగు వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.