Karam Borugula Mixture : సాయంత్రం సమయాల్లో స్నాక్స్ తినాలనిపించడం సహజం. అలా అని బయట దొరికే చిరుతిళ్లను తింటే అనారోగ్యాల పాలు కావల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న స్నాక్స్ ను తినడమే ఉత్తమం. కానీ చాలా మందికి స్నాక్స్ ను తయారు చేసేంత సమయం ఉండదు. కనుక శ్రమ లేకుండా కేవలం పది నిమిషాల్లోనే చేసేలా అలాగే రుచిగా ఉండేలా బొరుగులతో మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కారం బొరుగుల మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొరుగులు – 3 కప్పులు, వేయించిన కార్న్ ఫ్లేక్స్ – ఒక కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, పల్లీలు – పావు కప్పు, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పుట్నాల పప్పు – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్ లేదా తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
కారం బొరుగుల మిక్చర్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పుట్నాల పప్పు కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పసుపు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్ చూర్ పొడి వేసి కలపాలి. తరువాత బొరుగులు, కార్న్ ఫ్లేక్స్, ఉప్పు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే కారం బొరుగుల మిక్చర్ తయారవుతుంది.
సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా ఈ కారం బొరుగుల మిక్చర్ ను తయారు చేసుకుని తినవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. దీనిని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు. గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల ఈ మిక్చర్ 20 రోజుల వరకు తాజాగా ఉంటుంది.