ఆలుగడ్డలు అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని కూరగా చేసుకుని తింటారు. కొందరు చిప్స్‌గా చేసుకుని తింటారు. అయితే చిప్స్‌గా కంటే ఆలుగడ్డలను కూరగా చేసుకుని తింటేనే మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆలుగడ్డలను తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాలు
ఆలుగడ్డల్లో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఒక మీడియం సైజు ఉడకబెట్టిన ఆలుగడ్డ ద్వారా 161 క్యాలరీలు లభిస్తాయి. అందులో కొవ్వు 0.2 గ్రాములు, ప్రోటీన్లు 4.3 గ్రాములు, కార్బొహైడ్రేట్లు 36.6 గ్రాములు, ఫైబర్ 3.8 గ్రాములు లభిస్తాయి. అలాగే ఆలుగడ్డల్లో విటమిన్ సి, బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి.
మెదడు పనితీరుకు
ఆలుగడ్డలలో విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. ఒక మీడియం సైజు ఆలుగడ్డలో మనకు రోజుకు అవసరం అయ్యే విటమిన్ బి6లో దాదాపుగా 27 శాతం వరకు లభిస్తుంది. ఈ క్రమంలో ఈ విటమిన్ మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. మెదడు చురుగ్గా మారుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఈ విటమిన్ వల్ల సెరొటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నిద్ర చక్కగా పడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్
ఆలుగడ్డల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్మూలిస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
డయాబెటిస్
ఆలుగడ్డలను తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాటిని చిప్స్ రూపంలో తింటేనే అలా జరుగుతుంది. ఉడకబెట్టుకుని తినవచ్చు. ఆలుగడ్డల్లో రెసిస్టెంట్ స్టార్చ్ అనబడే ప్రత్యేకమైన పిండి పదార్థం ఉంటుంది. దీన్ని శరీరం పూర్తిగా విడగొట్టదు. శోషించుకోదు. అయితే ఇది పెద్ద పేగు వద్దకు చేరుకోగానే అక్కడ ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. దీని వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు ఎలుకలపై చేసిన పరిశోధనల ద్వారా వెల్లడించారు.
జీర్ణాశయం ఆరోగ్యం
ఆలుగడ్డల్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియాను పెంచుతుంది. దీంతో పెద్దపేగు వాపులు, క్యాన్సర్, అల్సర్లు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఆకలి నియంత్రణ
ఆలుగడ్డలలో ఉండే ప్రోటీనేజ్ ఇన్‌హిబిటర్ 2 (పీఐ2) అనే ప్రోటీన్ ఆకలిని నియంత్రిస్తుంది. అందువల్ల ఆలుగడ్డలను కొద్ది మొత్తంలో తిన్నా చాలు ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
సూచన: చాలా మంది ఆలుగడ్డలను పొట్టు తీసి ఉడకబెడుతుంటారు. అలా చేయరాదు. ఆలుగడ్డలను పొట్టు తీసి ఉడకబెడితే ఆ పొట్టులో ఉండే పోషకాలు అందవు. అలా కాకుండా పొట్టుతో వాటిని ఉడకబెడితే వాటిలో ఉండే పోషకాలు ఆలుగడ్డల్లోకి చేరుతాయి. తరువాత పొట్టు తీసేయవచ్చు. దీంతో ఆలుగడ్డల్లో ఉండే పోషకాలు అన్నీ మనకు లభిస్తాయి.