Majjiga Charu : మజ్జిగ.. పెరుగును చిలికి తయారు చేసే ఈ మజ్జిగ గురించి మనందరికి తెలిసిందే. మజ్జిగను తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. మన శరీరానికి ఎంతో మేలు ఈ మజ్జిగతో మనం రుచిగా మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మజ్జిగ చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
మజ్జిగ చారు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. ఈ పెరుగును కవ్వంతో ఉండలు లేకుండా కలపాలి. తరువాత దీనిలో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. తరువాత ఒక గ్లాస్ నీటిని పోసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న మజ్జిగలో వేసి కలపాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు తయారవుతుంది. పెరుగు, మజ్జిగ, పాలను తీసుకోవడానికి ఇష్టపడని వారు వాటితో ఇలా మజ్జిగ చారును తయారు చేసి తీసుకోవచ్చు. అన్నంతో కలిపి ఈ మజ్జిగ చారును తింటే చాలా రుచిగా ఉంటుంది. తియ్యటి పెరుగుతో చేసే ఈ మజ్జిగ చారు మరింత రుచిగా ఉంటుంది.