Tomato Masala Curry : టమాటాలు లేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. టమాటాలను మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. టమాటాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యం పాటు అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. టమాటాలతో వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా టమాటాలతో ఎంతో రుచిగా అలాగే తక్కువ సమయంలో అయ్యేలా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – 300 గ్రా., సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 5, జీడిపప్పు పలుకులు – 8, తరిగిన పచ్చిమిర్చి – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ.
టమాట మసాలా కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
టమాట ముక్కలు ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమారను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే వంటకాలతో పాటు టమాటాలతో ఇలా మసాలా కూరను కూడా తయారు చేసుకుని తినవచ్చు.