Chia Seeds For Weightloss : మనల్ని వేధిస్తున్న అనేక రకాల సమస్యల్లో అధిక బరువు ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. అధిక బరువు బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం,తగినంత శారీరక వ్యాయామం లేకపోవడం, మారిన జీవన విధానం, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని అధిక బరువు బారిన పడడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్య నుండి బయటపడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఒక ఇంటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. బరువును తగ్గించే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బరువును తగ్గించడంలో చియా విత్తనాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి చూడడానికి చిన్నగా నల్లగా ఉంటాయి. చాలా మంది చియా విత్తనాలు, సబ్జా గింజలు ఒక్కటే అని అనుకుంటారు. కానీ చియా విత్తనాలు వేరు. సబ్జా గింజలు వేరు. చియా విత్తనాలు నీటిలో ఎలా వేస్తే అలాగే ఉంటాయి. సబ్జా గింజలు మాత్రం నీటిలో వేస్తే తెల్లగా మారుతాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ చియా విత్తనాలను వేసి అర గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ నీటిని తాగుతూ ఈ విత్తనాలను తినాలి. వీటిని నేరుగా తినలేని వారు విత్తనాలను సలాడ్ లలో, జ్యూస్ లలో వేసుకుని తీసుకోవచ్చు. ఈ చియా విత్తనాలను రాత్రిపూట నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మనం మరిన్ని మంచి ఫలితాలను పొందవచ్చు.
వీటిని తీసుకునే ముందు ఈ నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలోని మలినాలు, విష పదార్థాలు కూడా తొలగిపోతాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు తేనెను ఉపయోగించకపోవడమే మంచిది. అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడే వారికి ఈ చియా విత్తనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే ఆకలి కూడా త్వరగా వేయదు. ఈ కారణం చేత మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. దీంతో మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
వీటిని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. చియా విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది అజీర్తి, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తలనొప్పితో బాధపడుతున్నప్పుడు నానబెట్టిన చియా విత్తనాలను తీసుకోవడం వల్ల తలనొప్పి వెంటనే తగ్గుతుంది. మైగ్రేన్ వంటి సమస్యతో బాధపడే వారు కూడా ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చియా విత్తనాలను ఈ విధంగా తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.
శరీరానికి తగినంత శక్తి లభించి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. అదేవిధంగా ఈ నీటిలో అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. పిల్లలకు ఈ నీటిని ఇవ్వడం వల్ల నీరసం వారి దరి చేరకుండా ఉంటుంది. వ్యాయామం చేసే వారు, అధిక శ్రమ చేసే వారు ఈ నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అధిక ఒత్తిడితో బాధపడే వారు ఈ నీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ విధంగా చియా విత్తనాలను తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.