Tomato Kothimeera Pachadi : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. టమాటాలతో చేసే ఏ పచ్చడైనా చాలా రుచిగా ఉంటాయి. టమాటాలతో చేసుకోదగిన పచ్చళ్లల్లో టమాట కొత్తిమీర పచ్చడి ఒకటి. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే టమాట కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కొత్తిమీర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – అర కిలో, తరిగిన కొత్తిమీర – 2 కట్టలు, నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, ఉప్పు – తగినంత, చింతపండు – రెండు రెమ్మలు, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, శనగపప్పు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
టమాట కొత్తిమీర పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక టమాట ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు వేసి కలపాలి. తరువాత వీటిపై మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలను పూర్తిగా ఉడికించాలి. టమాటాలు ఉడికిన తరువాత కొత్తిమీర వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కొత్తిమీర పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, ఇడ్లీ, దోశ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంటల్లో గార్నిష్ కోసమే కాకుండా కొత్తిమీరతో ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.