పులిపిరికాయలు సహజంగానే చాలా మందిలో వస్తుంటాయి. మెడ, చంకలు, వక్షోజాలు, గజ్జలు, కనురెప్పల మీద పులిపిరికాయలు ఏర్పడుతుంటాయి. చర్మం కింద మందంగా ఉన్న భాగాల్లో కొల్లాజెన్ ఫైబర్స్ పేరుకుపోవడం వల్ల పులిపిరికాయలు ఏర్పడుతాయి. అయితే ఇవి ప్రమాదకరమైనవి కావు. కానీ ఇవి ఉన్నప్పుడు ఆభరణాలు, దుస్తులను ధరిస్తే వాటికి అవి తాకితే దురద, నొప్పి కలుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో అసౌకర్యం కలుగుతుంది.
పులిపిరికాయలు అసలు ఎలా ఏర్పాడుతాయి అన్న విషయంపై ఇప్పటికీ నిపుణులు సరైన విషయాలు చెప్పలేదు. కానీ అధిక బరువు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారితోపాటు వంశ పారంపర్యంగా కూడా ఇవి ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. పులిపిరికాయలను డాక్టర్ల సమక్షంలో శస్త్ర చికిత్స ద్వారా తొలగించుకోవచ్చు. కానీ నొప్పిని భరించలేం అనుకునేవారు కింద తెలిపిన చిట్కాలను పాటించవచ్చు. దీంతో పులిపిరికాయలు తొలగిపోతాయి.
1. టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని పులిపిరికాయలను తగ్గించడం కోసం వాడవచ్చు. అయితే ముందుగా పులిపిరికాయలు ఉండే ప్రదేశాన్ని బాగా శుభ్రం చేయాలి. తరువాత ఆయిల్‌ను సున్నితంగా మర్దనా చేయాలి. దానిపై ఒక కాటన్ బ్యాండేజ్‌ను కట్టులా కట్టాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పులిపిరికాయలు రాలిపోతాయి.
2. యాపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ బాల్‌ను ముంచి దాన్ని పులిపిరికాయలపై ఉంచి కట్టు కట్టాలి. రోజుకు 3-4 సార్లు చేస్తే పులిపిరికాయలు పడిపోతాయి. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ యాసిడ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కనుక అందరికీ పడదు. కనుక ముందుగా దాన్ని కొద్దిగా చర్మంపై రాసి చూడాలి. దద్దుర్లు, మంట రాకపోతే అప్పుడు వాడవచ్చు. కళ్లపై ఉండే పులిపిరికాయలకు దీన్ని వాడకూడదు.
3. అరటి పండ్ల తొక్కల్లో యాంటీ ఏజింగ్ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల పులిపిరికాయలు తగ్గుతాయి. అరటి పండు తొక్కను తీసుకుని పులిపిరికాయపై వేసి కట్టులా కట్టాలి. లేదా పట్టీ, బ్యాండేజ్ వంటివి వేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా వారం పాటు చేస్తే పులిపిరికాయలు పడిపోతాయి.
4. విటమిన్ ఇ ఆయిల్‌ను రోజూ పులిపిరికాయలపై మర్దనా చేయాలి. దీంతో కొన్ని రోజుల్లో పులిపిరికాయలు పడిపోతాయి.
5. రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని బాగా నలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని పులిపిరికాయలపై రాయాలి. కొంతసేపు ఆగాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే పులిపిరికాయలు పడిపోతాయి.
6. చిన్న అల్లంముక్కను తీసుకుని నూరి మిశ్రమంగా చేసి దాన్ని పులిపిరికాయలపై రాయాలి. కొంత సేపటి తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.
కళ్లపై ఉండే పులిపిరికాయలకు మాత్రం పైన తెలిపిన చిట్కాలను వాడరాదు. డాక్టర్‌ను కలిసి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365