Parda Chicken Dum Biryani : మనం చికెన్ తో రకరకాల బిర్యానీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. మనకు రెస్టారెంట్ లలో, ధాబా లలో రకరకాల రుచుల్లో ఈ చికెన్ బిర్యానీ లభిస్తుంది. చికెన్ తో చేసుకోదగిన బిర్యానీల్లో పరదా చికెన్ ధమ్ బిర్యానీ కూడా ఒకటి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. బయట రెస్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా ఈ పరదా చికెన్ బిర్యానీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పరదా చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పరదా చికెన్ ధమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – రెండు కప్పులు, పంచదార – అర టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – అర టేబుల్ స్పూన్, సన్నగా పొడుగ్గా ఉల్లిపాయ తరుగు – 100 గ్రా., నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క, నెయ్యి – రెండున్నర టీ స్పూన్స్.
చికెన్ మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కాశ్మీరీ కారం – ఒక టీ స్పూన్, జాపత్రి పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, దంచిన యాలకులు – 4, గరం మసాలా – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – అర కప్పు.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – 2 కప్పులు, నీళ్లు – 2 లీటర్లు, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, యాలకులు – 5, లవంగాలు – 4, మరాఠీ మొగ్గలు – 3, సాజీరా – ఒక టీ స్పూన్, లవంగాలు – 6, ఉప్పు – తగినంత, తరిగిన పచ్చిమిర్చి – 6, నిమ్మకాయ – 1.
పరదా చికెన్ ధమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను గిన్నెలోకి తీసుకుని అందులో నూనె, పెరుగు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నూనె, పెరుగు వేసి కలిపి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో మైదాపిండి, పంచదార, ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత నూనె వేసి కలిపి పిండిపై తడి వస్త్రాన్ని ఉంచి పిండిని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో పావు కప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయలను రంగు మారే వరకు వేయించుకున్న తరువాత వాటిలో సగం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలపాలి. దీనిని ముందుగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్న తరువాత ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత చికెన్ పై మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చివరగా దీనిపై కొత్తిమీర, పుదీనా వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి.
తరువాత గిన్నెలో రెండున్నర లీటర్ల నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే బియ్యం,నిమ్మకాయ రసం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత ఈ నీటిని మరిగించాలి. నీళ్లు చక్కగా మరిగిన తరువాత ఇందులో నానబెట్టుకున్న బియ్యం, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత ఈ బియ్యాన్ని 90 శాతం వరకు ఉడికించి ప్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన పిండిని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ మందంగా ఉండే చపాతీల రుద్దుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉండే కళాయిని అందులో అడుగున బాదం పలుకులను ఉంచాలి. తరువాత వాటిపై రుద్దుకున్న చపాతీని వేసి చపాతీ అంచులను కళాయి బయటకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కళాయిలో ఉడికించిన అన్నంలో సగం అన్నాన్ని వేసుకోవాలి. తరువాత దానిపై కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. తరువాత ఉడికించిన చికెన్ ను వేసుకోవాలి.
ఈ చికెన్ పై మిగిలిన అన్నాన్ని, కొత్తిమీరను, పుదీనాను, కుంకుమ పువ్వు నీటిని లేదా రెండు ఫుడ్ కలర్ కలిపిన నీటిని వేసుకోవాలి. ఇప్పుడు చపాతీ అంచులను నెమ్మదిగా చేతిలోకి తీసుకుంటూ బిర్యానీని మూసి వేయాలి. పిండి విరిగిపోతూ ఉంటే చేతికి తడి చేసుకుంటూ మూసి వేయాలి. ఇప్పుడు కళాయిని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. ముందుగా రోటి ఎర్రగా అయ్యే వరకు వేడి చేసిన తరువాత కళాయిని అటూ ఇటూ తిప్పుతూ వేడి చేయాలి. రోటి కళాయి నుండి వేరయ్యే వరకు వేడి చేసిన తరువాత దానిపై పెన్నాన్ని బోర్లించి బిర్యానీని బోర్లా వేసుకోవాలి. తరువాత పెనం అంచుల వెంబడి నెయ్యి వేసుకుంటూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పరదా చికెన్ బిర్యానీ తయారవుతుంది. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. స్పెషల్ డేస్ లో, వీకెండ్స్ లో ఈ విధంగా పరదా బిర్యానీని ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. ఈ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.