Lemon Tea : లెమన్ గ్రాస్.. దీనిని డియోడ్రెంట్స్, సబ్బులు, కాస్మోటిక్స్ వంటి వాటితో పాటు హెర్బల్ టీ ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ చక్కటి వాసనతో పాటు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనితో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో లెమన్ గ్రాస్ ఎంతో సహాయపడుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. లెమన్ గ్రాస్ తో చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలన్నీ తొలగిపోతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ శక్తి మెరుగుపడడంతో పాటు అజీర్తి, డయేరియా వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈ లెమన్ గ్రాస్ పెయిన్ కిల్లర్ గా అలాగే యాంటీ క్యాన్సర్ గా కూడా ఉపయోగపడుతుంది.
దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కనుక రక్తహీనత సమస్యను తగ్గించడంలో ఈ కూడా లెమన్ గ్రాస్ మనకు తోడ్పడుతుంది. జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ లెమన్ గ్రాస్ చక్కగా పని చేస్తుంది. మూత్రపిండాలను శుభ్రపరిచి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో, అలాగే డయాబెటిస్ ను నియంత్రించడంలో కూడా ఈ లెమన్ గ్రాస్ మనకు సహాయపడుతుంది. ఇంట్లో ఉండే దోమలను, కీటకాలను తరిమివేయడంలో కూడా లెమన్ గ్రాస్ ఉపయోగపడుతుంది. ఈ లెమన్ గ్రాస్ తో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. లెమన్ గ్రాస్ తో మరింత రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా టీ ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ గ్రాస్ టీ ని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 400 ఎమ్ ఎల్, తరిగిన లెమన్ గ్రాస్ ఆకులు – 2, దంచిన అల్లం ముక్కలు – పావు టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూన్, దంచిన మిరియాలు – పావు టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత లెమన్ గ్రాస్ ను నలిపి వేసుకోవాలి. తరువాత నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి 400 ఎమ్ ఎల్ నీళ్లు 300 ఎమ్ ఎల్ అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ టీ ని వడకట్టుకుని అందులో నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లెమన్ గ్రాస్ టీ తయారవుతుంది. డయాబెటిస్ వారు ఇందులో బెల్లం పొడి వేసుకోకపోవడం మంచిది. తలనొప్పి, ఫ్లూ, జ్వరం, అజీర్తి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ విధంగా లెమన్ గ్రాస్ తో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.