Energy Laddu : మనలో చాలా మంది నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీంతో వారు పనులు చురుకుగా చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. రోజంతా నీరసంగా ఉండడం వల్ల చేసే పనిపై ఏకాగ్రత లోపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తరచూ నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడే వారు కింద చెప్పిన విధంగా డ్రై ఫ్రూట్స్ తో లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ లడ్డూలను తినడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఈ లడ్డూలు మనకు దోహదపడతాయి. రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టీ స్పూన్, బాదం పప్పు – అర కప్పు, జీడిపప్పు – అర కప్పు, పిస్తా పప్పు – అర కప్పు, ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – అర కప్పు, నువ్వులు – పావు కప్పు, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, పండు ఖర్జూర – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్.
డ్రై ఫ్రూట్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కొద్దిగా వేడైన తరువాత బాదం పప్పు వేసి వేడి చేయాలి. బాదం పప్పు కొద్దిగా వేగిన తరువాత జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత ఇందులోనే పిస్తా పప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఎండు ద్రాక్ష వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఎండు కొబ్బరి వేసి రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత నువ్వులను వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. చివరగా గసగసాలను వేసి చిటపటలాడే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత ముందుగా జార్ లో వేయించిన బాదం, పిస్తా, జీడిపప్పు, నువ్వులు వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత అదే జార్ లో వేయించిన ఎండు ద్రాక్షతో పాటు ఖర్జూరాలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో గసగసాలు, యాలకుల పొడి, మిరియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత మరో టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు తగినంత మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డూలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. పిల్లలకు రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది.