మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇందులో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. అయితే తెలుపు రంగు ముల్లంగి మనకు బాగా లభిస్తుంది. ముల్లంగితో కూరలు, పరోటాలు, పప్పు, సలాడ్స్ వంటివి చేసుకుని తింటుంటారు. అయితే ఘాటైన రుచి, వాసనను కలిగి ఉంటుంది కనుక ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే దాన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటారు. అవును, ముల్లంగి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముల్లంగిని తరచూ తీసుకోవడం వల్ల లివర్, జీర్ణాశయం శుభ్రమవుతాయి. ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముల్లంగి ఆకులను కామెర్ల చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఇక ముల్లంగిని తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ముల్లంగిలో ఉండే సల్ఫర్ హైపో థైరాయిడిజం సమస్య ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. అందువల్ల ముల్లంగిని తరచూ తినాలి.
2. ముల్లంగిని తినడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు పునర్నిర్మాణమవుతాయి. కణాలకు నష్టం కలగకుండా ఉంటుంది. దీంతోపాటు రక్తంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది.
3. ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. గాల్ బ్లాడర్‌ను సురక్షితంగా ఉంచుతుంది. శరీరంలో ద్రవాలు ఎక్కువగా చేరకుండా చూస్తుంది.
4. ముల్లంగిలో ఆంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
5. ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని తరచూ తీసుకుంటే హైబీపీని తగ్గించుకోవచ్చు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఆయుర్వేద ప్రకారం ముల్లంగి శరీరానికి చలువ చేస్తుంది. కనుక దీన్ని వేసవిలో కచ్చితంగా తీసుకోవాలి.
6. ముల్లంగిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని వల్ల తరచూ వచ్చే జలుబు, దగ్గుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు రావు.
7. ముల్లంగిని తీసుకోవడం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది.
8. జీర్ణవ్యవస్థ పనితీరును ముల్లంగి మెరుగు పరుస్తుంది. అసిడిటీని తగ్గిస్తుంది. అధిక బరువు తగ్గుతారు. గ్యాస్ సమస్యలు, వికారం వంటి సమస్యలను తగ్గించడంలో ముల్లంగి అద్భుతంగా పనిచేస్తుంది.
9. ముల్లంగిలో విటమిన్లు ఎ, బి6, సి, ఇ, కె లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, జింక్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందించడంతోపాటు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
10. రోజూ ముల్లంగి జ్యూస్‌ను తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముల్లంగిలో ఉండే విటమిన్ సి, జింక్, ఫాస్ఫరస్‌లు చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మం పొడిబారకుండా ఉంటుంది. మొటిమలు, మచ్చలు, దురదలు తగ్గుతాయి. ముల్లంగి పేస్ట్‌తో ముఖాన్ని కడుక్కోవచ్చు. జుట్టుకు దాన్ని అప్లై చేయవచ్చు. దీంతో చుండ్రు తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా మారుతాయి.
11. ఎండకాలంలో మనం సహజంగానే ద్రవాలను కోల్పోయి డీహైడ్రేషన్ బారిన పడుతుంటాం. అందువల్ల నీటిని ఎక్కువగా తాగాలి. ఇక నీరు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో ముల్లంగి ఒకటి. ముల్లంగిలో అధిక శాతం నీరు ఉంటుంది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. శరీరానికి కావల్సిన నీరు లభిస్తుంది. డీహైడ్రేషన్ సమస్య నుంచి బయట పడవచ్చు.