Mixed Dal Idli : ఇడ్లీలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటిని చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. ఇడ్లీలు తేలిగ్గా జీర్ణమవుతాయి. అందువల్ల చిన్నారుల నుంచి పెద్దల వరకు వీటిని ఎంతో సులభంగా తినవచ్చు. అలాగే శక్తి కూడా లభిస్తుంది. అయితే మనం ఇడ్లీలను రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా వివిధ రకాల పప్పులతోనూ చేసుకోవచ్చు. దీంతో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇక పప్పు దినుసులతో ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్డ్ దాల్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైసూర్ పప్పు – అర కప్పు, కంది పప్పు – అర కప్పు, పెసర పప్పు – అర కప్పు, పొట్టుతీయని మినప పప్పు – అర కప్పు, పచ్చి శనగ పప్పు – అర కప్పు, ముడి బియ్యం – అర కప్పు, పచ్చి మిర్చి – 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, ఆవాలు – 1 టీస్పూన్, మీగడ – 1 టీస్పూన్, వంటసోడా – 1 టీస్పూన్, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా.
మిక్స్డ్ దాల్ ఇడ్లీని తయారు చేసే విధానం..
ఆరు రకాల పప్పు ధాన్యాలను అరకప్పు కొలతతో తీసుకోవాలి. ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. తెల్లారి కడిగి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో నిమ్మరసం, వంటసోడా వేసుకుని కలపాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని మీగడ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుని ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ పొడి, ఉప్పు వేసుకుని ఆ తాళింపు తీసుకొచ్చి.. గ్రైండ్ చేసి పెట్టిన ఇడ్లీ పిండిలో వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు మీగడ రాసి ఇడ్లీ పిండి వేసుకుని ఆవిరి మీద ఉడకించాలి. 10-15 నిమిషాల తర్వాత వేడి వేడి ఇడ్లీలు రెడీ అవుతాయి.
ఇక ఈ ఇడ్లీలను నేరుగా అలాగే తినవచ్చు. లేదా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీలతో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. ఇలా తయారు చేసిన ఇడ్లీల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక శక్తి లభిస్తుంది. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. ఎప్పుడూ చేసే ఇడ్లీలకు బదులుగా ఇలా ఒక్కసారి మిక్స్డ్ దాల్ ఇడ్లీలను వేసి తినండి. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.