Mango Ice Cream : వేసవికాలం రానే వచ్చింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి తాపం నుండి బయట పడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వేసవితాపం బయటపడడానికి చాలా మంది ఐస్ క్రీమ్స్ ను తింటూ ఉంటారు. ఐస్ క్రీమ్స్ చల్ల చల్లగా చాలా రుచిగా ఉంటాయి. వీటిలో అనేక రుచులు ఉంటాయి. వాటిలో మ్యాంగో ప్లేవర్ ఐస్ క్రీమ్ కూడా ఒకటి. మామిడికాయ రుచితో ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ ఐస్ క్రీమ్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మ్యాంగో ఐస్ క్రీమ్ ను రుచిగా, చల్ల చల్లగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తియ్యటి పండు మామిడికాయ – 1, పంచదార – అర కప్పు, పాలు – అర లీటర్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, పాల పొడి – ఒక టేబుల్ స్పూన్.
మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ విధానం..
ముందుగా మామిడికాయపై ఉండే చెక్కును తీసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత కార్న్ ఫ్లోర్ లో తగినన్ని పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో పాలు, పంచదార వేసి వేడి చేయాలి. పంచదార కరిగి ఒక పొంగు వచ్చే వరకు పాలను వేడి చేయాలి. తరువాత ఇందులో పాలపొడి, ముందుగా తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. కార్న్ ఫ్లోర్ వేయగానే పాలు చిక్కబడతాయి. పాలు చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఒక జార్ లో మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత చల్లార్చుకున్న పాల మిశ్రమాన్ని వేసి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
దీనిని గాలి తగలకుండా మూత ఉండే ఒక గిన్నెలో వేసి రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత ఈ ఐస్ క్రీమ్ ను మరో సారి జార్ లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని మళ్లీ గిన్నెలో వేసి గాలి తగలకుండా గట్టిగా మూతను ఉంచాలి. దీనిని 8 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి గట్టి పడిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ తయారవుతుంది. ఈ విధంగా బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.