Pulka : మనం బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. బరువు తగ్గడానికి చాలా మంది రాత్రి భోజన సమయంలో లేదా మధ్యాహ్న సమయంలో అన్నానికి బదులుగా పుల్కాలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. నూనె లేకుండా తయారు చేసే ఈ పుల్కాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో ఇవి మనకు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ పుల్కాలను చాలా మంది మెత్తగా చేసుకోలేకపోతుంటారు. అలాగే పుల్కాలు పొంగకపోవడంతో పాటు గట్టిగా చెక్కలాగా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న పుల్కాలను తినలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల పుల్కాలు మెత్తగా పొంగుతూ వస్తాయి. అలాగే చాలా సమయం వరకు మెత్తగా ఉంటాయి. పుల్కాలు చక్కగా పొంగేలా మెత్తగా ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుల్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.
పుల్కా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని తగినంత ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పిండిని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తరువాత పిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక చపాతీని వేసి ముందు రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకోవాలి. తరువాత ఒక వైపును మాత్రమే చపాతీని ఎర్రగా కాల్చుకోవాలి.
ఇలా కాల్చుకున్న చపాతీని తక్కువగా కాల్చుకున్న వైపు పుల్కా పెనం మీద ఉంచి కాల్చుకోవాలి. పుల్కా ఎర్రగా కాలగానే ప్లేట్ లోకి తీసుకోవాలి. పుల్కాను మరో వైపుకు తిప్పి కాల్చుకోకూడదు. ఇలా ఒకవైపు పెనం మీద మరో వైపు పుల్కా పెనం మీద కాల్చుకోవడం వల్ల పుల్కాలు చక్కగా పొంగుతాయి. ఈ విధంగా పుల్కాలను తయారు చేసుకుని మనం ఏ కూరతోనైనా తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పుల్కాలు పొంగడంతో పాటు చాలా సమయం వరకు మెత్తగాఉంటాయి.