Dhaba Style Palak Dal : మనం పాలకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పాలకూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాలకూరతో ధాభా స్టైల్ లో పాలక్ దాల్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ దాల్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 100 గ్రా., చిన్న పాలకూర కట్టలు – 4, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6,,పసుపు – అర టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ.
పాలక్ దాల్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కడిగిన కందిపప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టాలి. తరువాత ఈ పప్పును 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పాలకూర వేసి కలపాలి. పాలకూరలో నీరంతా పోయి పాలకూర వేగిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత ఉడికించిన కందిపప్పు, చింతపండు రసం వేసి కలపాలి.
తరువాత ఒక గ్లాస్ లేదా తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ పప్పును మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ దాల్ ఫ్రై తయారవుతుంది. ఈ పప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అన్నం, చపాతీ, రోటి వంటి వాటితో కలిపి తింటే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది.