Dhaba Style Aloo Masala Curry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బంగాళాదుంపలతో చేసే రుచికరమైన వంటకాల్లో ఆలూ మసాలా కూర కూడా ఒకటి. దేనితోనైనా తినడానికి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ మసాలా కూరను మరింత రుచిగా ధాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ ఆలూ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బంగాళాదుంపలు – పావు కిలో, తరిగిన టమాటాలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 3, లవంగాలు – 4, సాజీరా – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ధాబా స్టైల్ ఆలూ మసాలా తయారీ విధానం..
ముందుగా జార్ లో టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో కారం వేసి కలపాలి. తరువాత మసాలా దినుసులు, పచ్చిమిర్చి వేసి కలపాలి. మసాలా దినుసులు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలు, ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి.
తరువాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత కసూరి మెంతి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మసాలా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పులావ్, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ధాబా స్టైల్ ఆలూ మసాలా కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.