Cauliflower Paratha : మనం ఉదయం అల్పాహారంగా తయారు చేసే పదార్థాలలో పరాటాలు కూడా ఒకటి. పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో వీటిని తయారు చేస్తూ ఉంటాం. వివిధ రకాల పరాటా వెరైటీలలో క్యాలీప్లవర్ పరాటా కూడా ఒకటి. ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే క్యాలీప్లవర్ పరాటాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాలీప్లవర్ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాలీప్లవర్ – 1 ( చిన్నది), పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – తగినంత, గోధుమపిండి – 3 కప్పులు.
క్యాలీప్లవర్ పరాటా తయారీ విధానం..
ముందుగా క్యాలీప్లవర్ ను ముక్కలుగా కట్ చేసుకుని గోరు వెచ్చని నీటిలో వేసి పది నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో నీటిని తీసుకుని క్యాలీప్లవర్ ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసి ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పిండిని తీసుకోవాలి. ఇందులో ఉడికించిన క్యాలీప్లవర్, ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత పెద్ద నిమ్మకాయంత ఉండలుగా చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ మందంగా ఉండే చపాతీలా వత్తుకోవాలి.
తరువాత ఈ పరోటాను పెనం మీద వేసి కాల్చుకోవాలి. ముందుగా రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకున్న తరువాత నూనె వేస్తూ చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్లవర్ పరాటా తయారవుతుంది. దీనిని రైతా, మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం అల్పాహారంగా తినడానికి ఈ పరాటాలు చక్కగా ఉంటాయి.