Instant Crispy Rice Flour Dosa : మనం అల్పాహారంగా తీసుకునే వంటకాల్లో దోశ కూడా ఒకటి. దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దోశను తయారు చేసుకోవడానికి ముందే రోజే పప్పును నానబెట్టి పిండి రుబ్బాల్సి ఉంటుంది. ఎటువంటి పప్పును నానబెట్టే పని లేకుండా పిండి రుబ్బే అవసరం లేకుండా కూడా మనం దోశలను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలు 5 నిమిషాల్లో రుచికరమైన క్రిస్పీ దోశలను తయారు చేసుకుని తినవచ్చు. బియ్యం పిండితో రుచికరమైన దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒకటిన్నర కప్పు, బొంబాయి రవ్వ – 4 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కరివేపాకు -కొద్దిగా, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – 4 కప్పులు.
బియ్యం పిండి దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని పలుచగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. పిండి నానిన తరువాత స్టవ్ మీద కళాయిని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక గంటెతో లేదా గిన్నెతో పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. ముందు పెనం అంచుల చుట్టూ పిండి వేసిన మధ్యలో పిండిని వేసుకోవాలి. ఈ దోశ రవ్వ దోశ మాదిరి ఉంటుంది.
పచ్చిదనం పోగానే నూనె వేసుకుని కాల్చుకోవాలి. దోశ ఒకవైపు ఎర్రగా కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అప్పటికప్పుడు క్రిస్పీగా, రుచిగా బియ్యం పిండితో దోశను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.