Corn Vada : మనం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికియవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో మనం చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా స్వీట్ కార్న్ తో రుచిగా, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే వడలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్న్ వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ గింజలు – ఒక కప్పు, బియ్యం పిండి – అర కప్పు, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం – ఒక చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 4, పచ్చిమిర్చి – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు- తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కార్న్ వడ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, జీలకర్ర, గుప్పెడు స్వీట్ కార్న్ గింజలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో మిగిలిన గింజలను కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత బియ్యం పిండి వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుంటూ వడల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ వడలు తయారవుతాయి. స్నాక్స్ గా తినడానికి ఈ వడలు చాలా చక్కగా ఉంటాయి. ఇంట్లో అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.