Lungs : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఊపిరితిత్తులు సరిగ్గా పని చేస్తేనే మనం శ్వాస తీసుకోగలుగుతాము. మన జీవితమంతా శ్వాసతోనే ముడి పడి ఉందని చెప్పవచ్చు. శ్వాస సరిగ్గా తీసుకుంటేనే మన ఆయుర్ధాయం, శక్తిసామర్థ్యం, మనో వికాసం పెరుగుతుంది. మన శరీర ఆరోగ్యం బాగుండాలన్నా, మానసిక స్థితి ఆరోగ్యంగా ఉండాలన్నా మనం మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. కానీ నేటి తరుణంలో చాలా మందిలో ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే దీనికి కారణం. చాలా మందిలో ఊపిరితిత్తులు 20 నుండి 30 శాతం వరకు మూసుకుపోయి సరిగ్గా పని చేయడమే మానేసాయి. దీంతో చాలా మందిలో మెదడు సామర్థ్యం తగ్గిపోతుంది.
శరీర ఆరోగ్యం కూడా సన్నగిల్లుతుంది. శరీర సామర్థ్యాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. క్రమంగా తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కనుక మనం మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనం చాలా సులభంగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగాలంటే ముందుగా ధూమపానాన్ని మానివేయాలి. ధూమపానం వల్ల గాలి గొట్టాలు మూసుకుపోతాయి. శ్లేష్మాలు ఎక్కువగా తయారవుతాయి. క్రమంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం, సామర్థ్యం దెబ్బతింటుంది. కనుక ధూమపానాని వెంటనే మానేయాలి.
అలాగే మనం ఎక్కడ కూర్చున్నా కూడా వంగి కూర్చోకూడదు. వెన్నుపూసను నిటారుగా ఉంచి కూర్చోవాలి. వంగి కూర్చోవడం వల్ల పొట్ట డయాఫ్రామ్ ను నొక్కి వేస్తుంది. దీంతో ఊపిరితిత్తులు ఎక్కువగా సాగవు. కనుక మనం నిటారుగా కూర్చోవాలి. అదే విధంగా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగాలంటే రోజూ 10 నుండి 15 నిమిషాల పాటు డీప్ బ్రీత్ తీసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ లేకుండా నీటిని ఎక్కువగా తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉండడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా ఉంటుంది. శ్లేష్మాలు ఎక్కువగా బయటకు పోతాయి.
కనుక నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే ఒత్తిడి, ఆందోళన, కంగారు పడడం వంటి వాటి వల్ల కూడా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి వాటి వల్ల గాలి గొట్టాలు ముడుచుకుపోతాయి. కనుక ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని మన దరి చేరుకుండా చూసుకోవాలి. అలాగే ఉదయం నిద్రలేచిన తరువాత వ్యాయామం, ప్రాణాయామం, సూర్య నమస్కారం, ఆటలు ఇలా ఏదో ఒకటి చేయాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సూచనలను పాటించడం వల్ల మన ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తులు సక్రమంగా పని చేస్తాయి. దీంతో క్రమంగా మన ఆయుర్దాయం, శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.