Akukura Biryani : మనలో చాలా మంది బికర్యానీని ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ బిర్యానీని ఇష్టపడతారని చెప్పవచ్చు. బిర్యానీ అనగానే మనకు చికెన్, మటన్, చేపలు, పనీర్, చేపల బిర్యానీలే గుర్తుకువస్తాయి. అయితే ఇవే కాకుండా మనం ఆకుకూరలతో కూడా ఎంతో రుచికరమైన బిర్యానీని తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో చేసుకోవడానికి ఈ బిర్యానీ చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఆకుకూర బిర్యానీ చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు కూడా కింద చెప్పిన విధంగా చేయడం వల్ల పర్ఫెక్ట్ బిర్యానీని తయారు చేయవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఆకుకూరలతో బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూర బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, సాజీరా – అర టీ స్పూన్, అనాస పువ్వు – 1, జాపత్రి – కొద్దిగా, మరాఠీ మొగ్గ- చిన్నది ఒకటి, కరివేపాకు – ఒక రెమ్మ, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన టమాటాలు – 2, తరిగిన లేత తోటకూర – 2 కట్టలు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక గ్లాస్, నీళ్లు – 2 గ్లాసులు, వేయించిన జీడిపప్పు – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర – గుప్పెడు, పుదీనా – గుప్పెడు, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 8, పచ్చిమిర్చి – 5.
ఆకుకూర బిర్యానీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేగిన తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత తోటకూర వేసి కలపాలి. తోటకూర పూర్తిగా వేగిన తరువాత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్యస్థ మంటపై నీరంతాపోయే వరకు ఉడికించాలి. తరువాత అన్నాన్ని మరోసారి కలుపుకుని మూత పెట్టి చిన్న మంటపై ఆవిరిపోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిపై జీడిపప్పును చల్లుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆకుకూర బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో తోటకూరకు బదులుగా పాలకూరను కూడా వాడుకోవచ్చు. ఆకుకూరలను తినని పిల్లలకు ఇలా బిర్యానీ చేసి పెట్టడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించవచ్చు.