Vankaya Masala Curry : మనం వంటింట్లో అప్పుడప్పుడూ బిర్యానీ, పులావ్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో వీటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని తినడానికి మిర్చీ కా సాలన్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. మిర్చీ కా సాలన్ వంటి వాటితో కలిపి తింటే బిర్యానీ మరింత రుచిగా ఉంటుందని మనందరికి తెలిసిందే. అయితే తరచూ బిర్యానీలోకి మిర్చి కాసాలన్ వంటి వాటినే కాకుండా వంకాయ మసాలా కర్రీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. వంకాయలతో చేసే ఈ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని బిర్యానీతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ మసాలా కర్రీని తయారు చేయడం కూడా చాలా సులభం. బిర్యానీ ఉడికే లోపు ఈ కర్రీని మనం తయారు చేసుకోవచ్చు. బిర్యానీతో తినడానికి వంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – పావు కప్పు, ఎండుకొబ్బరి ముక్క – 2 టేబుల్ స్పూన్స్, వంకాయలు – పావు కిలో, నూనె- 3 టేబుల్ స్పూన్స్, మెంతులు – చిటికెడు, ఆవాలు- అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెమ్మలు – 8, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి- ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నీళ్లు – అర గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లో వేసుకోవాలి. ఇందులోనే జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో మెంతులు, ఆవాలు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత టమాట ముక్కలు వేసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.
టమాట ముక్కలు మగ్గిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన వంకాయలు కూడా వేసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని బిర్యానీ, పులావ్, ప్లేన్ రైస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.