Ragi Palli Pakoda : మనం రాగిపిండితో రొట్టె, సంగటి వంటి వాటినే కాకుండా వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో రాగి పల్లి పకోడాలు కూడా ఒకటి. రాగిపిండి, పల్లీలు కలిపి చేసే ఈ పకోడాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ పకోడాలు అస్సలు నూనె పీల్చవు. అలాగే గట్టిపకోడాల వలె నిల్వ కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ పకోడాలను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. రాగి పిండి ఉంటే చాలు అరగంటలో ఈ పకోడాలను తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ రాగి పల్లి పకోడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి పల్లి పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – అర కప్పు, ఎండుమిర్చి – 8, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, ఉప్పు – తగినంత, రాగిపిండి – అర కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
రాగి పల్లి పకోడా తయారీ విధానం..
ముందుగా పల్లీలను, ఎండుమిర్చిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి చేత్తో బాగా కలపాలి. ఉల్లిపాయల్లో ఉండే నీరంతా బయటకు వచ్చిన తరువాత మిక్సీ పట్టుకున్న పల్లి మిశ్రమం, రాగిపిండి వేసి కలపాలి. ఇందులో నీటిని పోయకుండా కేవలం ఉల్లిపాయల్లో ఉండే నీటితోనే గట్టిగా పిండిని కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని పకోడాలు వేసుకోవాలి. వీటిని ముందుగా మధ్యస్థ మంటపై వేయించాలి.
ఇవి కొద్దిగా వేగిన తరువాత మంటను పెద్దగా చేసి వేయించుకోవాలి. పకోడాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి పల్లి పకోడాలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 3 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇలా తయారు చేసిన పకోడీలను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ పకోడీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.