Palamunjalu : గోదావరి జిల్లాల స్పెషల్ తీపి వంటకాల్లో పాలముంజలు కూడా ఒకటి. పాలముంజలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిని చాలా మంది రుచి చూసే ఉంటారని చెప్పవచ్చు. ఈ పాలముంజలను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పండగలకు, తీపి తినాలనిపించినప్పుడు, స్పెషల్ డేస్ లో ఇలా రుచిగా, కమ్మగా, అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా పాల ముంజలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ పాలముంజలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలముంజల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక కప్పు, నీళ్లు – పావు కప్పు, బెల్లం – ఒకటింపావు కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – అర కప్పు, యాలకుల పొడి – ముప్పావు టీ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, చిక్కటి పాలు – అర లీటర్, బియ్యంపిండి – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పాలముంజల తయారీ విధానం..
ముందుగా పప్పును శుభ్రంగా కడిగి నానబెట్టాలి. తరువాత ఈ పప్పును జార్ లో వేసి పావు కప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఎండుకొబ్బరి పొడి వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పెసరపప్పు మిశ్రమం వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం ఉండ చేయడానికి రాగానే యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత మరో కళాయిలో బటర్, అర కప్పు నీళ్లు, ఉప్పు వేసి వేడి చేయాలి. తరువాత బెల్లం వేసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దానిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు పొంగు వచ్చిన తరువాత మంటను చిన్నగా చేసి బెల్లం నీళ్లు పోసి కలపాలి. తరువాత బియ్యంపిండి వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉండ చేయడానికి వీలుగా ఉండేలా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత మూత పెట్టి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న బియ్యం పిండిని మరోసారి కలుపుకుని చేతికి నూనె రాసుకుంటూ కొద్దిగా పిండిని తీసుకుని పూరీలా వత్తుకోవాలి. తరువాత ఇందులో పెసరపప్పు ఉండను ఉంచి అంచులను మూసేసి ఉండలా చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పాలముంజలను నూనెలో వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలముంజలు తయారవుతాయి. వీటిని వేడిగా తిన్నా లేదా చల్లారిన తరువాత తిన్నా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన పాలముంజలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.