Vitamin D Levels : మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లలో విటమిన్ డి కూడా ఒకటి. ఇది అనేక జీవక్రియలకు రోజూ అవసరం అవుతుంది. విటమిన్ డిని మన చర్మం సొంతంగా తయారు చేస్తుంది. అనంతరం శరీరం దాన్ని నిల్వ చేసుకుంటుంది. ఈ క్రమంలో శరీరంలో నిల్వ అయ్యే విటమిన్ డి మనకు ఎప్పటికప్పుడు వినియోగం అవుతుంది. అయితే విటమిన్ డి తయారు కావాలంటే మనం రోజూ సూర్యరశ్మిలో శరీరం కాసేపు తగిలేలా ఉండాలి. అప్పుడే విటమిన్ డి తయారవుతుంది. లేదంటే విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి లోపం ఏర్పడితే మన శరీరం అనేక సంకేతాలను ఇస్తుంది. వాటిని బట్టి విటమిన్ డి లోపించిందని అర్థం చేసుకోవచ్చు.
విటమిన్ డి లోపం ఉందో లేదో తెలుసుకోవాలంటే సాధారణంగా రక్త పరీక్ష చేస్తారు. దాంతో విటమిన్ డి స్థాయిలను నిర్దారిస్తారు. ఇది తెలిస్తే విటమిన్ డి లోపం ఉందో లేదో తెలిసిపోతుంది. అయితే రక్తపరీక్ష అవసరం లేకుండానే మనం విటమిన్ డి ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే.. విటమిన్ డి లోపం ఉంటే తీవ్రమైన అలసట ఉంటుంది. చిన్న పని చేసినా బాగా అలసి పోతుంటారు. అలాగే ఎముకలు నొప్పిగా ఉంటాయి. కండరాలు బలహీనంగా అనిపిస్తాయి. కండరాలు పట్టేస్తుంటాయి. దీంతోపాటు మహిళల్లో అండాశయ సమస్యలు ఏర్పడుతాయి. అలాగే అధికంగా బరువు పెరిగిపోతారు. కిడ్నీ లేదా లివర్ వ్యాధులు వస్తాయి. ఇవన్నీ విటమిన్ డి లోపించిందని తెలిపేందుకు లక్షణాలు అని చెప్పవచ్చు.
మనకు రోజూ విటమిన్ డి దాదాపుగా 600ఐయూ మోతాదులో అవసరం అవుతుంది. రోజూ ఉదయం పూట ఎండలో శరీరం కనీసం 60 శాతం ఎండకు తగిలేలా దాదాపుగా 20 నిమిషాల పాటు ఉండాలి. దీంతో విటమిన్ డి తయారవుతుంది. అలాగే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి ని పొందవచ్చు. విటమిన్ డి మనకు ఎక్కువగా సముద్రపు చేపలు, కోడిగుడ్లు, చీజ్, పుట్టగొడుగులు, వెన్న తీయని పాలు వంటి ఆహారాల్లో లభిస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే కూడా విటమిన్ డి లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపం ఉన్నట్లు పరీక్షల్లో తేలితే డాక్టర్ సూచన మేరకు విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి.