Chana Chaat : మనం నల్ల శనగలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ప్రోటీన్ తో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శనగలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. శనగలతో చేసుకోదగిన రుచికరమైన వాటిల్లో చనా చాట్ కూడా ఒకటి. స్నాక్స్ గా తీసుకోవడానికి, సైడ్ డిష్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ చాట్ ను తయారుచేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ చాట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చనా చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
6 గంటల పాటు నానబెట్టిన శనగపప్పు – ఒక కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, నూనె – అర టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం -ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – 2టేబుల్ స్పూన్స్, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన కీరదోస ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, చాట్ మసాలా – అర టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒకటి లేదా రెండు టీ స్పూన్స్.
చనా చాట్ తయారీ విధానం..
ముందుగా నానబెట్టిన శనగలను కుక్కర్ లో వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇంగువ వేసి కలపాలి. తరువాత శనగలు వేసి కలపాలి. వీటిని రెండు నుండి 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ శనగలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో మిగిలిన పదార్థాలను వేసి కలపాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పైన ఉల్లిపాయ ముక్కలు, కారం, కొత్తిమీర, పల్లీలు, నిమ్మరసం చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చనా చాట్ తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా తయారు చేసిన చాట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.