Godhuma Ravva Kesari : మనం గోధుమరవ్వతో వివిధ రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. గోధుమ రవ్వతో చేసే తీపి వంటకాల్లో గోధుమ రవ్వ కేసరి కూడా ఒకటి. గోధుమ రవ్వతో చేసే ఈ కేసరి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా ప్రసాదంగా దీనిని తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది ఈ కేసరిని ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. 15 నుండి 20 నిమిషాల్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు. బెల్లంతో రుచిగా, కమ్మగా గోధుమ రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, సన్నగా ఉండే గోధుమ రవ్వ – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నేతిలో వేయించిన జీడిపప్పు – కొద్దిగా.
గోధుమ రవ్వ కేసరి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత గోధుమరవ్వను వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన రవ్వ వేసి కలపాలి. తరువాత మూత పెట్టి రవ్వను మెత్తగా ఉడికించాలి. రవ్వ ఉడికిన తరువాత బెల్లం తురుము వేసి కలుపుతూ ఉడికించాలి. బెల్లం కరిగి రవ్వ మరలా దగ్గర పడిన తరువాత రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కలుపుతూ ఉడికించాలి. తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత వేయించిన జీడిపప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ కేసరి తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా గోధుమ రవ్వతో రుచిగా, శరీరానికి మేలు చేసేలా కేసరిని తయారు చేసి తీసుకోవచ్చు.