Sleep : ఉరుకుల పరుగుల జీవితం, ఉద్యోగం, బాధ్యతలు నెరవేర్చడానికి మనం నిరంతరం కష్టపడుతూ ఉంటాము. సమయంతో సంబంధం లేకుండా నిరంతరం పని చేస్తూనే ఉంటాము. దీంతో మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొందరికి సమయం తక్కువగా ఉండడం వల్ల సరిగ్గా నిద్రపోరు. అలాగే మరికొందరు సమయం ఉన్నప్పటికి నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా రోజూ తగినంత నిద్రపోకపోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని మనందరికి తెలిసిందే. అయితే తాజా పరిశోధనల ప్రకారం నిద్రలేమి క్యాన్సర్ కు కూడా కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిపుణులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
తక్కువగా నిద్రపోయే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో ఈ అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. రాత్రి ఉద్యోగాల కారణంగా చాలా మంది మధ్యాహ్నం 12 గంటల తరువాత నిద్రపోతున్నారు. అలాగే చాలా మంది రాత్రి 10 నుండి 12 గంటల మధ్యలో నిద్రపోతున్నారు. మరలా త్వరగా మేల్కొంటున్నారు. దీంతో చాలా మందికి తగినంత నిద్ర సరిపోవడం లేదు. శరీరంలో సిర్కాడియన్ రిథమ్స్ అని పిలువబడే 24 గంటల అంతర్గత గడియారం ఉంటుంది. నిద్రతో పాటు అనేక విధులను నిర్వర్తించే ఈ గడియారంలో మార్పు రావడం వల్ల పెద్దప్రేగు, అండాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేస్ క్యాన్సర్ ఇలా అనేక రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రాత్రి ఉద్యోగాల కారణంగా ఎక్కువ సమయం వరకు మేల్కొని ఉంటున్నారు. దీంతో మనం నిద్రించే మరియు మేల్కొనే చక్రాల మధ్య మార్పు వస్తుంది.
ఇలా మార్పు రావడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ది చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక మనం రోజూ తగినంత నిద్రించడం చాలా అవసరం. రోజూ కనీసం 7 గంటల పాటు నిద్రపోవాలి. నిద్రించే ముందు సెల్ ఫోన్స్ చూడడం, టివీలు, ల్యాప్ టాప్ వంటి చూడడం తగ్గించాలి. బెడ్ రూమ్ లో నిద్రకు అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అలాగే నిద్రపోయే ముందు కెఫిన్ ఉండే పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. చక్కగా నిద్రపట్టడానికి నిద్రించే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే శరీరానికి తగినంత వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా వివిధ రకాల చిట్కాలను పాటిస్తూ రోజూ 7 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలని అప్పుడే ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.