Beerakaya Perugu Kura : మనం బీరకాయలతో రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాము. బీరకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బీరకాయలతో చేసుకోదగిన రుచికరమైన కూరలల్లో బీరకాయ పెరుగు కూర కూడా ఒకటి. బీరకాయ, పెరుగు కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఈ కూరను తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ బీరకాయ పెరుగు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ పెరుగు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీరకాయలు – పావుకిలో, శనగపిండి – 2 లేదా 3 టీ స్పూన్స్, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – రుచికి తగినన్ని, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, పెరుగు – ఒక కప్పు, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర -అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్.
బీరకాయ పెరుగు కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగపిండి వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. ఇందులో పసుపు, నీళ్లు, వేయించిన శనగపిండి వేసి ఉండలు లేకుండా కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.
బీరకాయ ముక్కలు మగ్గిన తరువాత ముందుగా కలిపిన పెరుగు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని కూరలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ పెరుగు కూర తయారవుతుంది. అన్నం, చపాతీ, రోటీ, పూరీ వంటి వాటితో తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.