Pandu Mirchi Tomato Nilva Pachadi : మనం పండుమిర్చితో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. సంవత్సరానికి ఒకసారి లభించే పండుమిర్చితో చేసే ఏ పచ్చడైనా చాలా రుచిగా ఉంటుంది. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో పండుమిర్చి టమాట పచ్చడి కూడా ఒకటి. పండుమిర్చి, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక్కసారి తయారు చేసుకుంటే నెలరోజుల పాటు తినవచ్చు. వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పండుమిర్చి టమాట నిల్వ పచ్చడిని రుచిగా, కమ్మగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పండుమిర్చి టమాట నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పండుమిర్చి – పావుకిలో, టమాటాలు – అరకిలో, మెంతులు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – 2 టీ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, చింతపండు – 50 గ్రా., రాళ్ల ఉప్పు – 50 గ్రా..
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – అర కప్పు, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 4, వెల్లుల్లి రెమ్మలు – 20, కరివేపాకు – 2 రెమ్మలు.
పండుమిర్చి టమాట నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా పండుమిర్చిని, టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మెంతులు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఆవాలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పండుమిర్చి ముక్కలు వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత టమాట ముక్కలు, చింతపండు వేసి కలపాలి. ఈ ముక్కలను మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత జార్ లో పండుమిర్చి ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని తడి లేని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత అదే జార్ లో ఉడికించిన టమాట ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తాళింపును పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పండుమిర్చి టమాట నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది.ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.