Guntur Vankaya Bajji : వంకాయలతో మనం రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. కూరలతో పాటు వంకాయలతో బజ్జీలను కూడా తయారు చేస్తూ ఉంటారు. వంకాయలతో చేసే బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వంకాయ బజ్జీలను తయారు చేయడం కూడా చాలా సులభం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వంకాయ బజ్జీలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ గుంటూరు వంకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటూరు వంకాయ బజ్జి తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడుగ్గా ఉండే లేత వంకాయలు – తగినన్ని, శనగపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 6, జీలకర్ర – ఒక టీ స్పూన్, చింతపండు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కొత్తిమీర – గుప్పెడు.
గుంటూరు వంకాయ బజ్జి తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వంకాయలకు గాట్లు పెట్టుకుని వాటిని వేడి నీటిలో వేసి అరగంట పాటు ఉంచాలి. తరువాత ఈ వంకాయలను తీసుకుని వాటిలో ఉల్లిపాయ పేస్ట్ ను స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న తరువాత గిన్నెలో శనగపిండి, బియ్యంపిండి, ఉప్పు, జీలకర్ర, పసుపు వేసి కలపాలి. తరువాత తగినన్నినీళ్లు పోసుకుంటూ దోశపిండిలా కలుపుకోవాలి. తరువాత వంకాయలను పిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుంటూరు వంకాయ బజ్జి తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే లేత వంకాయలు దొరకని వారు ఆ వంకాయలకు గాట్లు పెట్టి వాటిని వేడి నూనెలో వేసి 3 నిమిషాల పాటు వేయించి తీసుకుని ఆ తరువాత ఉల్లిపాయ పేస్ట్ స్టఫ్ చేసుకుని బజ్జీలు తయారు చేసుకోవాలి. ఈవిధంగా చాలా సులభంగా వంకాయ బజ్జీలను తయారు చేసి తీసుకోవచ్చు.